సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ , మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమ్మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. తిరుగుప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని పేర్కొంది. భూమ్మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. తొమ్మిది నెలలు అంతరిక్షం లో ఉండి భూమ్మీదకు ప్రయాణం అవుతున్న సునీత మొఖంలో ఆనందం కనిపించింది. ఈ ఫోటోలను నాసా ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు.
బుధవారం తెల్లవారు జామున రాక…
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్లాకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఇక్క భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు చేపట్టనున్నారు. దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. సునీతా విలియమ్స్, విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు.
కేప్ కెనావెరాల్ వ్యోమనౌక మొరాయించడంతో
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టారైనర్లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, కేప్ కెనావెరాల్ వ్యోమనౌక మొరాయించడంతో
వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. కేప్ కెనావెరాల్ వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి విదితమే!
భారత కాలమానం ప్రకారం సునీత తిరుగు పయనం ఇలా…
- క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత మంగళవారం ఉదయం 8.15కు ప్రారంభమైంది.
- అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 10.15 గంటలకు విడిపోయింది.
- భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలన బుధవారం తెల్లవారుజామున 2 41 గంటలకు
- సాగర జలాల్లో ల్యాండింగ్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు
- సహాయ బృందాలు రంగంలోకి దిగి. క్రూ డ్రాగనన్ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకు వస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.