కృతయుగంలో (సత్య యుగం) ధర్మం నాలుగు పాదాలతో, త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలమీద, ద్వాపర యుగంలో రెండు పాదాలు మీద నడిస్తే, ఈ కలియుగంలో కేవలం ఒక పాదం మీద నడుస్తోంది అని వేదాలు, పురాణాలు తెలియ చేస్తున్నాయి. ధర్మం అంటే ఏమిటి? అనే ప్రశ్న తలెత్తినప్పుడు,—”ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతమ్” అని అంటారు. ధర్మాలు అన్నీ సాక్షాత్తు పరమాత్మ నుండే లభించాయి. ఆ ధర్మాలనే వేదాలలో నిక్షిప్తం చేశారు. ధర్మం అంటే మనం అనుసరించే జీవన శైలి. ఇతరులకు హాని కలగకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్మలమైన జ్ఞానికి ధర్మ మార్గాలు నిర్వహించడంలో సత్య మార్గాన్ని అనుసరిస్తూంటే, మన జీవితం సుఖమయం. మనసుకు నిర్మలత్వం సిద్ధిస్తుంది. మానవమనుగడకు మనువు, పరాశరాది స్మృతులు అనేక ధర్మాలను విశదీకరిస్తున్నాయి.
మహాభారతంలో ధర్మ స్సతాం హత: పుంసాం ! ధర్మ శ్చైవాశ్రయ: !
ధర్మాల్లోకా స్తయ స్తాత ! ప్రవృత్తా స్స చరాచర: !!
సత్పురుషుల వాక్యము ధర్మం గానే ఉంటుంది. ధర్మము అటువంటి వారినే ఆశ్రయించి ఉంటుంది. మూడులోకాల్లోను చర చరా జగత్తు అంతా ధర్మం వలననే చలిస్తోందని భావం.
భగవద్గీత ప్రారంభంలోనే మొదటి శ్లోకంలోనే
”ధర్మ క్షేత్రే కురు క్షేత్రే అని ప్రారంభించ బడింది. అంటే మన భారతదేశం ధర్మక్షేత్రం. అదే మన మనసును కూడా ధర్మం క్షేత్రంగా మరల్చుకొంటే, ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ధర్మం నాలుగు విధాలుగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. 1.సామాన్య ధర్మాలు. 2.శాస్త్రీయ ధర్మాలు 3.వర్ణధర్మాలు 4. ఆశ్రమ ధర్మాలు.
భార్య ధర్మం, వివాహం ధర్మం, వృత్తి ధర్మం, తండ్రి ధర్మం, సత్య ధర్మం. ఇలా చాలా రకాలుగా ఉంటుంది. చేయవలిసిన పనే, న్యాయ సమ్మతంగా, ఇతరులకు భౌతికంగా, మానసికంగా, హాని కలిగించకుండా నిర్వర్తించడమే ధర్మం. ఇవన్నీ సామాన్య ధర్మాలు. శాస్త్రీయధర్మాలు అంటే పితృదేవతల కార్యాలు, దైవసంబధమైన కార్యాలు, దానాలు, ఉపనయన సంస్కారం, వివాహం, వంటివి.
సృష్టి క్రమంలోనే మానవులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. వేదాలలో ప్రతి వర్ణానికి కొన్ని ధర్మాలు, సమాజ హితం కోసం, సమాజాభి వృద్ధికి, నిర్దేశించబడ్డాయి. వాటిని అనుసరించడమే మనందరి ధర్మం. నాలుగు ఆశ్రమవాసాలు చెప్పబడ్డాయి. ఆయా ఆశ్రమ సమయాలలో ఆయా ధర్మాలు అనుసరించాలి. ఒక సారి ధర్మరాజు నారదమహర్షిని సందర్శించినప్పుడు
”మహర్షీ! మీరు సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. సర్వజ్ఞుడవు. సర్వధర్మాలు, ఆచారవ్యవహారాలు తెలిసిన జ్ఞానివి. నాకు ధర్మం అంటే ఏమిటి? ధర్మ స్వరూపం గురించి వివరించమని కోరగా, నారదమహర్షి బదులిస్తూ ”లోక క్షేమం కోసం బదరికా వనంలో తపోదీక్షలో ఉన్న నారాయణుడు సనాతన ధర్మం గురించి నాకు వివరించారు ఆ విషయాలు నీకు తెలుపుతున్నాను. అన్ని వర్ణాల ప్రజలకు సత్యం, సంతోషం, సమదృష్టి, వివేకం, శౌచం, క్షమ, దయ, దానం, మార్థవం, మనోనిగ్రహం, మహాజన సేవ, అహింస, మిత భాషిత్త్వం, ఇంద్రియ జయం, బ్రహ్మచర్యం, జీవులలో పరమాత్మ దర్శనం, అభేదబుద్ధితో ప్రవర్తించడం, ఉపవాసాధి క్రతువు, ఆత్మావలోకనం, అన్నోదకాలు పంచిపెట్టడం, అసభ్య వాంఛలు,అనర్థకమైన క్రియలు, విడిచిపెట్టడం ఇంకా శ్రీమన్నారాయణుడి కథా శ్రవణం, నామ సంకీర్తన సేవాభావం, దాస్యం, సౌఖ్యం, ఆత్మ సమర్పణ అనే ఈ ముప్పై ధర్మాలు అలవరుచుకోవాలి. అని ఇంకా వివరం ఇచ్చారు.
భగవద్గీత రెండవ అధ్యాయంలో —
నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా
న చా భావయత: శాన్తి దశాస్తస్య కుత: సుఖమే !!
అంటే ఇంద్రియ నిగ్రహం, మనస్సంయమము లేని వారికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతన సంభవింపదు. వారికి శాంతి లభించదు. శాంతిలేనివారికి సుఖము ఎక్కడిది? అని పరమాత్మ హెచ్చరించారు. అందుకే మనం ధర్మ మార్గంలో నడిచి శాంతి సౌఖ్యాలు పొందుదాం.
- అనంతాత్మకుల రంగారావు