తప్పు చేసినోళ్లని వదలం
-
- పేర్ని నానికి మతి చెడింది
అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు
- మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం కేసును తేలుస్తాం
మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర
( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి ) మొలకలచెరువు, ఇబ్రహీంపట్నంలో ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా విచారణ జరిపిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను గుంటూరులోని ల్యాబ్‌కు పంపించామన్నారు. ల్యాబ్ రిపోర్టుల ప్రకారం.. మద్యం కల్తీ నిజమేనని, అయితే గతంలో ఉన్నట్లుగా ప్రమాదకరమైన రసాయనాలు ఏవీ నిర్ధారణ కాలేదన్నారు. నివేదికలు బయటకు రాకముందే.. వైసీపీ నేతలు, బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మద్యం కల్తీ..వైసీపీ కుట్రే
వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన రావు స్పష్టం చేశాడు. జోగి రమేష్ అండతోనే
ఇబ్రహీంపట్నం, మొలకలచెరువులో మద్యం కల్తీ చేసినట్లు తెలిపాడు. అదే సమయంలో జనార్ధన్ రావు తన ఇంటికొచ్చినట్లు జోగి రమేష్ కుూడా అంగీకరించాడు. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతల పాత్ర, ప్రభుత్వంపై చేసిన కుట్ర బయటపడుతుండడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు.
హాలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్ని నాని చెప్పడం హాస్యాస్పదం. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థ 2014-..19 మధ్యనే తీసుకొచ్చాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019-..24 మధ్య మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. గత ఐదేళ్లు కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. జగన్ రెడ్డి అరాచకం ఏ స్థాయికి చేరిందంటే.. తన కల్తీ మద్యం అమ్మకాల కోసం ఏకంగా టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వ షాపులకు కల్తీ మద్యాన్ని తరలించారు. అలాంటి వారు కూటమిపై నిందలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
నానికి మతి భ్రమించింది
పేర్ని నానికి మతి బ్రమించి ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. రాష్ట్రంలో రూ.99 మద్యం బ్రాండ్లు ఆపేశామని చెప్పడానికి పేర్నినానికి బుద్ధి ఉందా. రాష్ట్రంలో 20శాతానికి పైగా అమ్మకాలు ఆ బ్రాండ్లే జరుగుతున్నాయనే విషయం తెలుసుకోవాలి. మద్యం షాపు నిర్వాహకులు పెట్టిన ఇండెంట్ ప్రకారమే సరఫరా జరుగుతుంది తప్ప.. గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా బలవంతంగా కల్తీ బ్రాండ్లను ప్రజల నెత్తిన రుద్దే పరిస్థితి ఉండదనే విషయం పేర్ని తెలుసుకోవాలన్నారు. గత ఐదేళ్లు ఏపీలోని కల్తీ మద్యం తాగలేక పొరుగు రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో ఏపీలో మద్యం ఆదాయం పోయింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం సరిహద్దు జిల్లాల్లో 40-60 శాతం అమ్మకాలు పెరిగాయి. సరిహద్దుల్లో ఒక్క బాటిల్ కూడా ఏపీకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. పచ్చి అబద్దాలు చెప్పడానికి జగన్ రెడ్డి అండ్ కో సిగ్గుపడాలి. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల్ని భయంబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు.
ప్రజల నెత్తిన రుదొద్దు
తప్పులు చేసి... ఆ తప్పిదాలను ప్రజల నెత్తిన రుద్దాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో మద్యం కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. అందుకే ఏపీ సురక్షా యాప్ తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ స్కాన్ చేస్తూ.. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కల్తీపై మాట్లాడే ఏ వైసీపీ నాయకుడైనా.. చెక్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన రోజు నుండి లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. మీలా కల్తీని ప్రోత్సహించబోం. మద్యం కల్తీ కేసులోని నేరస్తులందరిపైనా చర్యలుంటాయి. మద్యం కేసు వెనుక వైసీపీ నేతల భారీ కుట్ర క్రమంగా బయటపడుతోంది. కల్తీ మద్యం కేసులో ఉన్న పాత్రధారులు సూత్రదారులందరికీ బుద్ధి చెప్పి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు