TG | రేపు లాల్ ద‌ర్వాజా బోనాలు.. ట్రాపిక్ ఆంక్షలు, వైన్ షాపులు బంద్ !

హైదరాబాద్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ ఆంక్షలు జూలై 20-21 తేదీలలో అమలులో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ముఖ్యంగా, సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయంలో జూలై 21న నిర్వహించే బోనాల సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయం పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించబడుతుంది.

ట్రాఫిక్ ఆంక్షల వివరాలు..

  • ఇంజన్ బౌలి, ఫలక్ నుమా నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను న్యూ షంషేర్ గంజ్ వద్ద నుంచి గోశాల, మిస్రీగంజ్ వైపు మళ్లిస్తారు.
  • మహబూబ్ నగర్ క్రాస్ రోడ్డు నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలు ఇంజన్ బౌలి నుంచి జహనుమా, గోశాల వైపు మళ్లించబడతాయి.
  • నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజాకు వెళ్లే వాహనాలను గౌలిపురా వైపు మళ్లిస్తారు.
  • చార్మినార్ నుంచి నల్లచింత వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపు మళ్లిస్తారు.
    వీటితో పాటు, మరికొన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ మార్గాల్లో తాత్కాలిక మార్పులు ఉంటాయని జోయల్ డేవిస్ పేర్కొన్నారు.

మ‌రోవైపు, హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బోనాల ఉత్సవాల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్లు జారుగా మారే అవకాశం ఉన్నందున వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది.

ట్రాఫిక్ ఆంక్షలు – వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ శాఖ కోరింది.

రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా వైన్ షాపులు, బార్లను 20, 21న మూసివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై 20న ఉదయం 6 గంటల నుంచి జూలై 22 ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో మద్యం విక్రయాలను నిలిపివేశారు. ప్రజలు ప్రశాంతంగా బోనాలు జరుపుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా నివారించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే వైన్స్ బంద్ కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమేనని మెుత్తం రాష్ట్రం అంతగా కాదని గమనించాలి ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రజలు బోనాలు జరుపుకుంటారు. అందుకే 21న తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థ‌ల‌కు, బ్యాంకులకు సెలవుగా ప్ర‌క‌టించింది.

Leave a Reply