Laboratory | ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం

Laboratory | ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం

  • తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి

Laboratory | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవలే నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో అగ్నిప్రమాదం జరిగిన విషయం విధితమే. అయితే ఈ అగ్నిప్రమాదంపై వస్తున్న వార్తలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ ప్రమాదంలో కీలకమైన కేసుల ఫైల్స్ కాలిపోయాయనేది పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ ఆయన డీజీపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తం 1926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్నారు. 1,183 లైసెన్స్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 181 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను సిద్ధం చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి ఫోరెన్సిక్ FSL అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని శివధర్ రెడ్డి వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవమని, ఆ కేసు ఫైల్స్‌ను 2021లోనే కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులూ ఇచ్చామన్నారు. హైప్రొఫైల్ కేసుల సాక్ష్యాధారాలు, డిజిటల్ ఫైల్స్ అన్నీ సురక్షితంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.

అగ్నిప్రమాదం కేవలం కంప్యూటర్ సెక్షన్ అండ్ లైబ్రరీ ఉన్న ప్రదేశంలోనే జరిగిందని, సాక్ష్యాలు భద్రపరిచే స్టోర్ రూమ్‌లకు మంటలు వ్యాపించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కావాలని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

Leave a Reply