LA 2028 | ఒలింపిక్స్‌లో భార‌త్ ఆశ‌లు వీరిపైనే..!

లాస్ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ 2028కు కౌంట్‌డౌన్ మొదలైంది. మూడు ఏళ్ల ముందే షెడ్యూల్‌ బయటకు వచ్చేసింది. కాగా, ఈసారి క్రికెట్, కాంపౌండ్ ఆర్చరీ, స్క్వాష్ వంటి కొత్త ఈవెంట్లను చేర్చడంతో భారతదేశం పతక అవకాశాలు మరింత బలపడ్డాయి. వీటితో పాటు, గతంలో భారత క్రీడాకారులు మంచి ఫలితాలను చూపించిన సాంప్రదాయ విభాగాలలోని ఫలితాలు 2028 ఒలింపిక్స్‌లో భారత్ కు పతక ఆశలను రెట్టింపు చేస్తున్నాయి.

క్రికెట్ : 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్ వేదికపై

క్రికెట్‌ 1900 తర్వాత మొదటిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెడుతోంది. ఇండియా పురుషుల జట్టు ఇప్పటికే రెండు వన్డే, ఒక టీ20 వరల్డ్‌కప్‌, ఏడు ICC టైటిల్స్‌ గెలిచి ప్రపంచం దృష్టి ఆకర్షించింది. ఆసియా క్రీడల స్వర్ణంతో పాటు, మహిళల జట్టు ఆసియా కప్‌లో ఆధిప‌త్యాన్ని ప్రదర్శించింది. దీంతో LA 2028లో క్రికెట్‌లో డబుల్ గోల్డ్ భారత్ టార్గెట్!

కాంపౌండ్ ఆర్చరీ: ఎట్టకేలకు ఒలింపిక్ టికెట్

భార‌త ఆర్చ‌ర్లు… ప్రపంచం కల్లు తిప్పేలా చేస్తున్న విభాగం కంపౌండ్ ఆర్చరీ. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, 2022 ఆసియా క్రీడల్లో ఐదు స్వర్ణాలతో భారత్ బలమైన పట్టును ప్రదర్శించ‌గా… ఈ విభాగానికి ఒలింపిక్స్‌లో చోటు దొరికింది.

జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ, ధీరజ్ బొమ్మదేవర వంటి స్టార్ ఆర్చర్లు LA 2028 పోడియంపై నిలవాలని పెట్టుకుని పతక పోర‌కు సిద్ధ‌మౌతున్నారు.

ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో గోల్డ్ ఆశలు..

భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో తొలి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా… 2028లోనూ అతనికి గోల్డ్ ఫేవరెట్ స్థానం ఉంది. జావెలిన్‌లో కిషోర్ జెనా, హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజ్, స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబుల్ కూడా పోడియం లక్ష్యంగా సాధన చేస్తున్నారు.

బాక్సింగ్, హాకీ, షూటింగ్ పై భారత్ ప‌ట్టు..

బాక్సింగ్‌లో, నిఖత్ జరీన్, లవ్లినా బోర్గోహైన్, నీతు గంగాస్, అమిత్ పంఘల్ వంటి పంచ్ మాస్టర్లు పోడియం లక్ష్యంగా బరిలోకి దిగ‌నున్నారు. హాకీలో, పురుషులు – మహిళలు ఇద్దరూ స్థిరంగా పతక పోటీదారులుగా కొనసాగుతున్నారు. షూటింగ్‌లో, మను భాకర్, రుద్రాంక్ష పాటిల్, సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే పతక ఆశలకు బలమైన మద్దతుగా ఉన్నారు.

బ్యాడ్మింటన్ – షటిల్ ఆశలు

భారత స్టార్ షట్లర్లలో పివి సింధు, లక్ష్య సేన్, సాత్విక్-చిరాగ్ (పురుషుల డబుల్స్) ల‌కి పోడియంపై నిలబడే సామర్థ్యం ఉంది. ఇప్పటికే రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు తన మూడవ పతకం కోసం రేసులో ఉంది. ఇక‌ లక్ష్య సేన్ ఇటీవల వరల్డ్ టూర్, కామన్వెల్త్‌లో తన ప్రతిభను చూపించాడు. పెద్ద టోర్నమెంట్లలో బాగా ఆడాలనే మనస్తత్వం అతనికి పెద్ద ప్లస్ పాయింట్. డబుల్స్‌లో, సాత్విక్-చిరాగ్ వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుని పోడియం ఆశలను గణనీయంగా పెంచుకున్నారు.

ఇతర కేటగిరీల్లోనూ పోడియం ఆశలు..

అనాహత్ సింగ్ (స్క్వాష్) ఇప్పటికే 17 సంవత్సరాల వయసులో రెండు ఆసియా ఛాంపియన్‌షిప్ స్వర్ణాలు గెలుచుకుంది. ఆమె LA 2028 పోడియంపై స్థానం సాధించగలదని స్క్వాష్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

మానికా బాత్రా (టేబుల్ టెన్నిస్), అదితి అశోక్ (గోల్ఫ్), భావాని దేవి (ఫెన్సింగ్), ప్రణతి నాయక్ (జిమ్నాస్టిక్స్), రోహన్ బోపన్న, సుమిత్ నాగల్ (టెన్నిస్) లు కూడా పతకాలు గెలుచుకుని పోడియంపై నిలబడగల సామర్థ్యం కూడా కలిగిన వారే.

ముఖ్యమైన స్పోర్ట్స్ & వేదికలు

ఈవెంట్ తేదీలు వేదిక
క్రికెట్జూలై 12–29ఫెయిర్‌గ్రౌండ్స్ క్రికెట్ స్టేడియం
షూటింగ్జూలై 15–25లాంగ్ బీచ్ & విట్టియర్ నారోస్
అథ్లెటిక్స్జూలై 15–30LA మెమోరియల్ కొలిసియం
రెజ్లింగ్జూలై 24–30LA కన్వెన్షన్ సెంటర్ హాల్ 2
హాకీజూలై 12–29కార్సన్ ఫీల్డ్
బ్యాడ్మింటన్జూలై 15–24గాలెన్ సెంటర్
బాక్సింగ్జూలై 15–30పీకాక్ థియేటర్, DTLA అరీనా
వెయిట్‌లిఫ్టింగ్జూలై 25–29పీకాక్ థియేటర్
ఆర్చరీజూలై 21–28కార్సన్ స్టేడియం
టేబుల్ టెన్నిస్జూలై 15–29LA కన్వెన్షన్ సెంటర్ హాల్ 3
స్క్వాష్జూలై 15–24యూనివర్సల్ సిటీ స్క్వాష్ సెంటర్

క్రికెట్, ఆర్చరీ, బ్యాట్మింటన్, షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, బాక్సింగ్, హాకీ, స్క్వాష్ ఇలా ఏ విభాగం చూసినా టీమిండియాను పోడియం ఆశలకు నడిపించే సామర్థ్యం ఉన్న బలమైన ఆటగాళ్లు ఉన్నారు.

ఒలింపిక్స్‌కు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నందున, భారత ఆటగాళ్లు స్థిరమైన ఫామ్, అద్భుత కాంబినేషన్స్, సరైన ప్రిపరేషన్స్ తో 2028 LA ఒలింపిక్స్‌లో పోడియంపై నిలబడటానికి మంచి అవకాశం ఉంది.

Leave a Reply