ఉచిత మెగా వైద్య శిబిరం..

ఉచిత మెగా వైద్య శిబిరం..

పోలీసుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: ఎస్పీ విక్రాంత్ పాటిల్.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, పోలీసుల సంక్షేమమే శాఖకు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మహిళా సాధికారతలో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని, మహిళలు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపారు.

కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 185 మంది పోలీసు సిబ్బందికి రక్తపోటు, షుగర్, ఈసిజి, టు-డీ ఎకో, పీఎఫ్‌టి, బీఎమ్‌డీ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం వైద్యుల బృందాన్ని ఎస్పీ అభినందించి, శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్, ఎఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు మంజునాథ్, రఘునందిని, సువర్ణ, సింధూర, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, మహిళా పీఎస్ సీఐ రామయ్యనాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, ఆర్‌ఐలు జావేద్, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు, మహిళా పోలీసులు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు శాఖ పోలీసుల సంక్షేమం కోసం ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a Reply