Kurnool | హోంగార్డుల సేవలు అభినందనీయం..
Kurnool | కర్నూల్, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 63 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనం పై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. 1963 సంవత్సరంలో ఆవిర్భవించిన హోంగార్డు వ్యవస్థ పోలీసుశాఖలో కీలకంగా మారిందన్నారు. పోలీసులతో సమానంగా శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. అన్ని విభాగాలు, బందోబస్తు విధులలో బాగా పని చేస్తున్నారన్నారు. సాధారణ డ్యూటీలు మొదలుకొని, క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పని చేస్తున్నారన్నారు. అయితే.. పారదర్శకంగా, నిజాయితీగా పని చేయాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకితభావంతో పని చేయాలన్నారు. పోలీసు సిబ్బందితో సమానంగానే హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన హోంగార్డు సిబ్బంది, విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు. అలాగే పదవి విరమణ చేసిన శ్రీనివాస శెట్టి, శేషమ్మ, వీరమ్మ, హసినా బేగం.. ఈ నలుగరు హోంగార్డులను జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సన్మానించారు. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్, కర్నూల్ డీఎప్పీ బాబు ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు, హోమ్ గార్డ్ డిస్పీ ప్రసాద్ , పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సిఐలు మధుసుధన్ రావు, చంద్రబాబు నాయుడు, నాగరాజా రావు, మన్సురుద్దీన్, ఆర్ ఐలు పోతల రాజు, జావేద్, నారాయణ, ఆర్ ఎస్సైలు మహేశ్వరరెడ్డి, హుస్సేన్, ప్రదీప్, కల్పన, మహాలక్ష్మీ పోలీసు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

