Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- కృష్ణాతరంగ్ – 2025 ప్రారంభం
- ఉత్సాహంగా పాల్గొన్న యువత
Krishna Tarang | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వాలు తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం అనే నిబంధన తీసుకురావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(venkayya nayudu) పేర్కొన్నారు. గురువారం కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణా తరంగ్ 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు అరుదుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాలు(Correspondence) తెలుగులోనే జరిపేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.
విద్యార్థులు చదువుతో పాటు కళలు, ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవాలన్నారు. మన దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ(Economic system)గా అవతరించబోతున్న దశలో దేశంలో ఇంకా బ్రిటిష్ వాళ్ల ఆనవాళ్లు కనిపిస్తుండటం మంచిది కాదన్నారు. రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి బందరులో యువకెరటాలు కార్యక్రమం చేపట్టగా నలభై వేలు మంది పాల్గొనడం జరిగిందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం క్రమం తప్పకుండా కృష్ణాతరంగ్(Krishnatarang) నిర్వహించడం అభినందనీయమన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. మచిలీపట్నం కళలకు పుట్టినిల్లు లాంటిదన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులకు, పాత్రికేయులకు, ఉత్తమ రాజకీయవేత్తలకు పేరుగాంచిన కృష్ణా జిల్లాలో కృష్ణా విశ్వవిద్యాలయం(Krishna University) ఏర్పాటులో తన పాత్ర ఉండటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా ఉండాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ..1970 సంవత్సరం నుంచి వెంకయ్య నాయుడుతో పరిచయం ఉందని, కార్యకర్త స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన ఆయనను విద్యార్ధులు స్ఫూర్తి(inspiration)గా తీసుకుని ఎదగాలన్నారు.

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ అధ్యక్షోపన్యాసం చేస్తూ జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, కృష్ణా తరంగ్ 2025 కన్వీనర్ ఆచార్య దిలీప్(Acharya Dilip) తదితరులు ప్రసంగించారు. తొలుత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్‌సీసీ విద్యార్ధుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి బెలూన్లు ఎగురవేసి కృష్ణా తరంగ్ 2025ను లాంఛనంగా(Formally) ప్రారంభించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

