గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్..

గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్..
వికారాబాద్, ఆంధ్రప్రభ : గత రెండు విడుతలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులను గ్రామపంచాయతీ కేటాయించకుండా.. మహిళా సర్పంచ్ అయిన నన్ను అకారణంగా గత మూడు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శిని నియమించకుండా.. తాము గతంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తు ప్రతినెల గడపగడపకు తిరుగుతూ ప్రజా పాలన కొనసాగిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నానే , అక్కసుతో అధికార పార్టీ నాయకులు తమ పై కక్షగట్టి వేధిస్తున్నారు. ఈ కారణంగా తాము గ్రామసభను బహిష్కరిస్తున్నట్టు మోమిన్ పేట మండలం కోల్కొంద గ్రామ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి కరణం కీర్తి రామకృష్ణ పేర్కొన్నారు.
ఇటీవల గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ (చెక్ నెంబర్ 1 4 3 2 0 3) మార్చ్ 10వ తేదీన రిలీజ్ అయినట్టు సమాచారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అందలేదని ఈ విషయమై మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మార్వో కార్యాలయంలో సమాచారం ఇచ్చినప్పటికీ ఒకరి పై ఒకరు చెప్పడం తప్పా న్యాయం చేయడం లేదన్నారు. జిల్లా ఎస్పీ దృష్టికి ఈ చెక్కు విషయమై సమాచారం ఇవ్వగా ఇది క్రిమినల్ సమస్య కాదని కనీసం మర్యాద ఇవ్వకుండా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ పట్ల అధికారులు అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు తమను తీవ్రంగా కలిచి వేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చదవడానికి తనకు మనసు ఒప్పడం లేదని చెప్పుకోడానికి తప్పా ప్రభుత్వ పథకాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.
తమ గ్రామంలో తామిచ్చిన హామీలను 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే.. గ్రామపంచాయతీ కార్యదర్శి సుమారు మూడు నెలలుగా లేరని వెంటనే గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి నియమించాలని మార్చి 10న మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ వెంటనే అందేలా చూడాలని తెలిపారు. తమను అడుగడుగునా అవమానపరుస్తూ జవాబుదారీ తనములేని ప్రభుత్వం సూచించిన ముఖ్యమంత్రి సందేశాన్ని తాను చదవలేకపోతున్నానని గ్రామ సభను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గత రెండు దపాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులను విడుదల చేయడం పాటు గ్రామానికి తక్షణం గ్రామపంచాయతీ కార్యదర్శి నియమించాలని కోరారు.
