Supari | నా భర్తను లేపేయండి…రూ.20 లక్షలు ఇస్తా..

ఖమ్మం అర్బన్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి రచించిన ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు.. ఆ భార్య తన భర్తను హత్య చేసేందుకు ఏకంగా రూ.20లక్షల సుపారీ ఇవ్వడం విశేషం.. ఖమ్మం అర్బన్‌ (ఖానాపురం హవేలీ ) సీఐ భానుప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగొండ మండలం సువర్ణపురానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్‌ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్‌ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్‌ వెంకట్‌ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు.

వెంకట్‌ తన స్నేహితుడు, రౌడీషీటర్‌ అయిన పగడాల విజయ్‌కుమార్‌ అలియాస్‌ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్‌గా వివాహిత మహిళ నుంచి తీసుకున్నారు. ఈక్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్‌ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు.

కాగా, ఆ వ్యక్తి ఏప్రిల్‌ 11న ఖమ్మం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్‌ ఆపరేటర్‌ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్‌ ), పగాడాల విజయ్‌కుమార్‌ (చంటి – బైక్‌ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం ), వేముల కృష్ణ (బైక్‌ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం ), బుర్రి విజయ్‌ (డెకరేషన్‌ వర్కర్, బృందావన్‌కాలనీ పువ్వాడఅజయ్‌నగర్, ఖమ్మం ) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్‌ గన్, రూ.90,000 నగదు, 5 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్‌ వివరించారు. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు బాధితుడి భార్య ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *