కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి

కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఎ.కొండూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన పిట్టా ఇస్సాకు (52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం సాయంత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుడికి భార్య,ఇద్దరు సంతానం ఉన్నారు. ఇస్సాకు మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు,స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మృతుడి కుటుంబాన్ని వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు అందించాలన్నారు.

జల జీవన్ మిషన్ ద్వారా అందించాల్సిన కృష్ణా జలాల పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని, కిడ్నీ రోగులకు పౌష్టికాహారం కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply