Khelo India | క్రీడా అభివృద్ధికి రూ.1106 కోట్ల ప్రతిపాదనలు…

Khelo India | క్రీడా అభివృద్ధికి రూ.1106 కోట్ల ప్రతిపాదనలు…

కేంద్ర క్రీడాశాఖ మంత్రితో శాప్ చైర్మన్ రవి నాయుడు, రామ్మోహన్ నాయుడు భేటీ
ఖేలో ఇండియా ఇన్ఫ్రా కింద 53 ప్రాజెక్టులకు నిధుల విజ్ఞప్తి

Khelo India | విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి భారీ స్థాయిలో కేంద్ర సహకారం కోరుతూ రాష్ట్ర ప్రతినిధులు న్యూఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కలిసి కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి మనసుఖ్ మండవుయాను గురువారం న్యూఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక వసతుల విస్తరణ, యువతకు మెరుగైన శిక్షణ సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. ఖేలో ఇండియా మౌలిక వసతుల పథకం కింద రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన క్రీడా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 53 క్రీడా ప్రాజెక్టులకు సుమారు రూ.1106 కోట్ల నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.

Khelo India |

Khelo India | 28 జిల్లాల్లో ఆర్చరీ రేంజ్‌లు ఏర్పాటు

రాష్ట్రంలోని అమలాపురం, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, కుప్పం, కర్నూలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ఆధునిక క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు సమావేశంలో వివరించారు. యువతలో క్రీడా ఆసక్తి పెంపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని 28 జిల్లాల్లో ఆర్చరీ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు. అదే విధంగా సముద్ర తీర ప్రాంతాలను క్రీడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మచిలీపట్నం, తిరుపతి సమీప ప్రాంతాలు, విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ , బాపట్ల జిల్లాలోని సూర్యాలంక బీచ్ వద్ద ఆధునిక వాటర్ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అలాగే విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. దివ్యాంగ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ సదుపాయాలు కల్పించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి కూడా పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE :9mar2026 | షా(క్రా)కర్స్…ఆనందం..ఆకాశం… !

CLICK HERE TO READ MORE

Leave a Reply