Kenjutsu Pawan : తొలి తెలుగు యోధుడు AndhraPrabha SPL News

Kenjutsu Pawan : తొలి తెలుగు యోధుడు AndhraPrabha SPL News
డిప్యూటీ సీఎం పవన్నకు ప్రపంచం ఫిదా
జపనీస్ కెంజుట్సు సభ్యుడుగా గుర్తింపు
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
తెలుగు నేలలోనే కాదు.. యావత్ భారతావనిలో పవర్ స్టార్ గా… అశేష అభిమానుల గుండె చప్పుడు.. ఇప్పుడు తెలుగునేలో జనసేనాధిపతిగా అవతరించటమే కాదు.. యుద్ధ కళల్లోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపూర్వ గౌరవాన్ని సాధించారు. ప్రపంచంలోనే తొలి తెలుగు యోధుడు సమురాయ్ గా పవనన్నను జపనీస్ గుర్తించారు. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ కాస్త.. కెంజుట్సు వపన్ కళ్యాణ్ గా పేరు తెచ్చుకున్నారు.

ఔను జపనీస్ అత్యంత ప్రాచీన కెంజుట్సు (Kenjutsu) యుద్ధ కళలో సభ్యత్వం సాధించారు. కెంజుట్సు ప్రవేశంతో ఆయనను అధికారికంగా ‘సమురాయ్’ (Samurai) అని ఇక పిలుస్తారు. ఇదే కాదు, మరిన్ని ప్రధాన గౌరవాలు ఇలా ఉన్నాయి. జపానీ అత్యంత ప్రాచీన యుద్ధ వంశం ‘టకెడా షింగెన్ క్లాన్’ (Takeda Shingen Clan) లో సభ్యత్వం తొలి తెలుగు సమురాయ్‌గా అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. యుద్ధ కళల పట్ల ఆయన అంకితభావాన్ని గుర్తిస్తూ ‘గోల్డెన్ డ్రాగన్స్’ సంస్థ ఈ విశిష్ట బిరుదు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ (Tiger of Martial Arts) ను ప్రదానం చేసింది.

జపనీస్ యుద్ధ కళా రంగంలో అత్యున్నత ప్రామాణిక సంస్థ ‘సోగో బుడో కన్రీ కై’ (Sogo Budo Kanri Kai) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు 5వ దాన్ స్థాయిని ప్రదానం చేసింది. సోకే మురామత్సు సెన్సే (Soke Muramatsu Sensei) పరంపరలో ఈ అరుదైన సభ్యత్వాన్ని తొలి తెలుగు యోధుడుగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు.
Kenjutsu Pawan : కెంజుట్సు యోధుడే
ఆయనకు కేవలం ఒక సభ్యత్వమే కాకుండా, ఒక చారిత్రాత్మక యుద్ధ వంశంలో భాగస్వామ్యం లభించింది. అందుకే ఆయనను ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ వర్గాల్లో సమురాయ్‌గా గౌరవిస్తున్నారు.

జపానేతర వ్యక్తులకు, ముఖ్యంగా జపనీస్ కాని వారికి ఈ గౌరవం దక్కడం అత్యంత అరుదు. ఈ గౌరవం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల పాటు కఠోర సాధన , యుద్ధ కళల పట్ల అంకితభావంతో శ్రమించి ఈ గుర్తింపును పొందారు. హంషీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూద్ (Dr. Siddiq Mahmoodi) పర్యవేక్షణలో కెంజుట్సు, కెండో (Kendo)లో శిక్షణ పొందారు.

ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘కెండో’లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం, లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ కేవలం సినిమా రంగంలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచీన యుద్ధ కళలలో లోతైన పరిజ్ఞానం నైపుణ్యం కలిగిన అరుదైన భారతీయ వ్యక్తిగా నిలిచారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపును పవన్ కళ్యాణ్ సాధించారు.
Kenjutsu Pawan : ఔను బహుముఖ ప్రజ్ఙాశాలి

పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు.
యుద్ధకళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు.. క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్‌కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి.
Kenjutsu Pawan : మార్షల్ ఆర్ట్స్ ఆరోప్రాణం
మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది.
కరాటే సంబంధిత యుద్ధకళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి, సాంకేతికంగా తాత్వికంగా బలమైన పునాది ఏర్పరుచుకున్నారు. కాలక్రమేణా, శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు.
Kenjutsu Pawan : వెండి తెరపై..సూపర్
మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు ప్రజాదరణ తీసుకొచ్చారు.
మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ALSO READ : AP Local War Siren : చంద్ర పవనం
