
KCR | ఎవడికి కావాలె.. నీ ఫ్యూచర్ సిటీ..?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శల పదును పెంచారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కొత్త పాలసీని తీసుకురాలేదని, కేవలం తనపై అక్కసు వెళ్లగక్కడమే రేవంత్ రెడ్డి సర్కార్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పారిశ్రామిక, వ్యవసాయ, రాజకీయ అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చావాలని శాపనార్థాలా?
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ పాలసీయా?” అని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి అహంకారపూరిత రాజకీయాలు చేయలేదన్నారు.
కానీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షాలను ఎలా వేధించాలో చూపిస్తోందని విమర్శించారు. రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, గతంలో ఇంటి వద్దకే యూరియా వచ్చేదని, కానీ ఇప్పుడు బస్తా కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆస్తుల విలువ పడిపోయిందని, రియల్ ఎస్టేట్ రంగాన్ని బ్రోకర్ల పరం చేశారని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ‘ఫ్యూచర్ సిటీ’పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “నీ ఫ్యూచర్ సిటీ.. తొక్కలో సిటీ.. ఇది ఎవడికి కావాలి?” అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఫార్మా హబ్‌గా మార్చడానికి తాము ఎంతగానో కృషి చేశామని, ఐడీపీఎల్ (IDPL) ద్వారా మొదలైన ప్రస్థానం నేడు ప్రపంచానికి వ్యాక్సిన్లు సరఫరా చేసే స్థాయికి చేరిందని గుర్తు చేశారు.
హైదరాబాద్‌ను కాలుష్యం నుండి కాపాడాలని, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఫార్మా సిటీ’ని డిజైన్ చేశామని వివరించారు. ఐదారు సంవత్సరాలు కష్టపడి, రైతుల నుంచి 14 వేల ఎకరాలను సేకరించామని, దీన్ని ఒక ఎకో-సిస్టమ్‌గా మార్చాలనుకుంటే, రేవంత్ ప్రభుత్వం దాన్ని రియల్ ఎస్టేట్ దందాల కోసం ముక్కలు చేస్తోందని మండిపడ్డారు.
కుప్పకూలిన భూముల ధరలు..
బీఆర్‌ఎస్ హయాంలో పెంచిన భూముల ధరలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కుప్పకూలాయని కేసీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు రోడ్డు పక్కన భూమి ఉన్న రైతు ధీమాగా ఉండేవాడని, ఇప్పుడు కూతురి పెళ్లి కోసం తక్కువ ధరకే భూమిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ అధికారం కోసమే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులను వేధిస్తున్నారని విమర్శించారు. “నేను చేసిన అప్పులపై కాగ్ (CAG) ఇప్పటికే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పొద్దస్తమానం నన్ను తిట్టడం మానేసి, పాలనపై దృష్టి పెట్టండి” అని కేసీఆర్ హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే వాస్తవాలు బయటపడతాయని కేసీఆర్ హెచ్చరించారు.
