KCR | ఇక తోలుతీస్తా.. కేసీఆర్ ఉగ్రరూపం

- పాలమూరుపై కాంగ్రెస్ ద్రోహం..
- నీటి వాటా తగ్గింపుపై ఆగ్రహం
- ప్రజా ఉద్యమాలకు పిలుపు..
- గ్రామగ్రామాన బహిరంగ సభలు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల పాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చామని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక మౌనంగా ఉండలేనని, ప్రజా క్షేత్రంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నానని స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “90.1 టీఎంసీల అనుమతి ఉన్న ప్రాజెక్టుకు కేవలం 45 టీఎంసీలు చాలని ఏ ప్రాతిపదికన అంగీకరించారు? ఎవడబ్బ సొమ్మని ఈ నిర్ణయం తీసుకున్నారు?” అని ఆయన నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌లను (DPR) తిప్పి పంపినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరి డైరెక్షన్ ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను పట్టిసీమకు తరలిస్తున్న తరుణంలో, ఆ నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాల్టి దాకా ఒక కథ.. రేపటి నుంచి వేరే కథ.. ఇక నిద్రపోనివ్వను, తోలుతీస్తా అని హెచ్చరించారు.
డప్పులు వాయించి మరీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చాటిచెబుతామని, ఏర్పాటు చేసే ప్రతి బహిరంగ సభకు తానే స్వయంగా హాజరవుతానని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సర్వభ్రష్టమైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేసీఆర్ ఆరోపించారు. జంటనగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, ఎన్‌సీఆర్‌బీ (NCRB) నివేదిక ప్రకారమే రాష్ట్రంలో క్రైమ్ రేట్ 20 శాతం పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను టెంప్ట్ చేసి, మోసపూరిత పద్ధతిలో దొంగదారిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రతిబింబించేలా రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పోరాటం తీవ్రతరం అవుతుందని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు.
