kavitha | ఇదేం కొత్త కాదు.. కేసీఆర్‌‌కు లేఖపై కవిత క్లారిటీ !

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు ఇటీవల రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కవిత… లేఖ రాసిన విషయం నిజమేనని అన్నారు. అయితే, అందులో ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె వివరించారు.

“రెండు వారాల క్రితమే నేను మా నాయకుడు కేసీఆర్ కి లేఖ రాశాను. ఇలాంటి లేఖలు రాయ‌డం ఇది మొదటిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలానే పర్సనల్‌గా లేఖలు రాసాను. కానీ ఈసారి అది బయటకు రావడం బాధాకరం” అని కవిత పేర్కొన్నారు.

లేఖ లీక్ అయిన విషయాన్ని తీవ్రంగా అభివర్ణించిన కవిత, పార్టీ అంతర్గతంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా దీన్ని లీక్ చేశారని ఆరోపించారు. “లేఖ బహిర్గతం వెనుక కుట్ర ఉంది. దాని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఇది పార్టీని బలహీనపరిచే ప్రయత్నం” అని ఆమె అన్నారు. అయితే, ఆ లేఖలో త‌ను పార్టీ నాయకుల అభిప్రాయాలను మాత్రమే రాశానని కవిత చెబుతున్నారు.

తన నాయకుడు కేసీఆర్ పట్ల అపారమైన భక్తి, నమ్మకం ఉన్నదని స్పష్టం చేసిన కవిత, “కేసీఆర్ మా దేవుడు లాంటి వారు. కానీ ఆయన చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నాయి. పార్టీ, కుటుంబం ఐక్యంగా ఉన్నాం. దీనిని దెబ్బతీసే ప్రయత్నాలు కొందరి కుట్రలు మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

Leave a Reply