బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ, డిప్యూటీ సీఎం పదవికి డికె శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… డీకే శివకుమార్ అపరిపక్వత, బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపించారు.
మరోవైపు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరియు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 106 కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టేడియంలోని గేట్ నెం.7 వద్ద ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ విజయాన్ని పురస్కరించుకుని నగరం మొత్తం జరుపుకోవాల్సిన వేడుక కాస్తా, సరైన ప్రణాళిక లేకపోవడం, అస్పష్టమైన సమాచారం, నియంత్రణ చర్యలు విఫలం కావడం వల్ల విషాదంగా మారిందని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు గల పూర్తి కారణాలు విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మృతుల్లో ఎక్కువ మంది యువతే
ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో 13 ఏళ్ల బాలిక అత్యంత పిన్న వయస్కురాలు. ముగ్గురు టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మృతులను దివ్యాంశి (13), దొరేశ (32), భూమిక్ (20), సహాన (25), అక్షత (27), మనోజ్ (33), శ్రావణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20)గా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలా మంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా, కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు.