Karnataka | కాపీలూ-టిపినీలూ

karnataka | కాపీలూ-టిపినీలూ

karnataka | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. కలిసుండాలని తెలిసినా విబేధిస్తూ విమర్శిస్తూ, మళ్ళీ ఒకరికొకరు చిరునవ్వులతో కరచాలనాలు చేసుకుంటూ.. ఇదంతా ఎవరో సృష్టించినదే కానీ, మా మధ్య ఏం లేదంటూ…ఇవన్నీ కాంగ్రెస్ లోనే సాధ్యం. స్థానిక నేతల మధ్య సమీకరణలు అర్థం చేసుకోవడం, వారిమధ్య మనస్ఫర్థలను పరిష్కరించడం అధిష్టానానికి పెద్ద తలనొప్పి. అయినా, “రంగంలోకి రాహుల్ (Rahul)..ఈ విషయంలో అధిష్టానం సీరియస్…నేరుగా సంప్రదింపులు-మధ్యవర్తిత్వం జరుపనున్న ట్రబుల్ షూటర్ ఫలానా….” అంటూ హడావుడి చెయ్యడం తప్ప నిజానికి కొన్ని సమస్యలకు అధిష్టానం వద్ద కూడా పరిష్కార మార్గాలుండవు. అందుకే సంప్రదింపుల పేరుతో సాగదియ్యడం, వాయిదాల పేరుతో వదిలించుకోవడం….ఇలా అనేకరకాల ప్రత్యామ్నాయాలు మనం చూస్తూంటాం.

karnataka |రసవత్తరం…కర్నాటకం

Karnataka

ఇక ప్రస్తుతం కర్ణాటకలో అధికారమార్పిడి విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ల మధ్య జరుగుతున్న సైలెంట్ వార్ అధిష్టానానికి అంతుచిక్కకుండా ఉంది. అందుకే తాత్సారం చెయ్యడం మినహా వారింకేం చెయ్యలేకపోతున్నారు. ఎందుకంటే, శిద్ధూ నుంచి సీఎం సీటు లాక్కుని డి.కె. కి ఇస్తే కర్ణాటకలో ఏం జరుగుతుందో అధిష్టానానికి స్పష్టంగా తెలుసు. ఏం జరగకూడదో అదే జరుగుతుంది. అసలే అతితక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో (Election) కర్ణాటకను కూడా కోల్పోవలసి వస్తుంది.

అలాగని అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న డీ.కే.శివకుమార్ (D.K. Shivakumar) ను బుజ్జగించడం, నచ్చజెప్పడం, డిప్యూటీ సీఎం పదవిస్తోనే సరిపెట్టుకోమని చెప్పడం కూడా సాధ్యం కావడం లేదు. అసలే బీహార్ ఫలితాలతో ఆత్మ రక్షణలో పడిన పార్టీకి ఇది అదనపు తలనొప్పి. అందుకే ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నించడం మినహా వారివద్ద ఇంకేం ప్లాన్లు లేవు ప్రస్తుతానికి.


ఇప్పుడు పరిస్థితెలా ఉందంటే, ఒకప్పుడు కాంగ్రెస్ (Congress) లో సమన్వయ కమిటీ అని ఒకటి వేసారు. అయితే, ఎవరెవరి మధ్య సమన్వయం లేదో వారందరినీ ఈ సమన్వయ కమిటీలో వేశారంటూ రకరకాల గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆ కమిటీ ఏమైపోయిందో, సమన్వ్యం లేనివారి మధ్య ఆ కమిటీ తో సమన్వయం కుదిరిందో, లేదో…
మధ్యమధ్యలో కలిసి కనిపిస్తూ…తామిద్దరూ కలిసే ఉన్నామని పదేపదే చెప్పడానికి ప్రయత్నిస్తూన్నారు సిద్ధూ-డీకేలిద్దరూ.

karnataka | కలిసుందాం…రా..

కలిసుంటే పదే పదే చెప్పడమెందుకో మరి అని అందరిలోనూ ఒకటే డౌటనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాకాదని ఈమధ్య ఒకరింటికి మరొకరు టిఫిన్లకు ఆహ్వానించుకుంటూ…కలిసి లొట్టలేసుకుంటూ ఈ ఎపిసోడ్ ని రక్తి కట్టిస్తున్నారు. ఈ సమైక్యత ఎంత కాలం పనిచేస్తుందో తెలియదుగానీ, అధిష్టానానికి మాత్రం ఈ మంత్రం బాగా పనిచేసినట్టనిపించినట్టుంది. అందుకే తరచూ కలుసుకోండి, కలిసి కాపీలు తాగండి, టిపినీలు చేయండి…కానీ కలహించుకోకండి. అది మీకే కాదు, పార్టీకీ (Party) నష్టమంటూ సుతిమెత్తగా హెచ్చరించిందేమో. అందుకే మొహాల నిండా నవ్వులు పులుముకుని ప్రస్తుతానికి ‘మేమింతే’ అంటూ ఫోటోలకి పోజులిచ్చేస్తున్నారు. ఈ టిపినీల రాజీమంత్రమెంతకాలం పనిచేస్తుందో చూడాలి.

Click Here To Read | GST SCAM :   రూ. 1000 కోట్ల దందా

Click Here To Read More

Leave a Reply