కరీంనగర్ ఆంధ్రప్రభఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటు లోనే కొమురయ్య విజయం సాధించడం విశేషం.
బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 12,959 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. పి ఆర్ టి యు అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి కి 7,182 ఓట్లు వచ్చాయి. సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బండిల్లుగా విభజించి ఇన్ వ్యాలీడ్ ఓట్లను తొలగించిన అనంతరం 14 టేబుల్ ల పైకి బ్యాలెట్ పేపర్లను చేర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
27,888 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉండగా 25,032 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ లో భాగంగా 871 ఓట్లను చెల్లని ఓట్లుగా అధికారులు పక్కన పెట్టారు. అనంతరం 14 టేబుల్ల ద్వారా మొదటి రౌండ్లో 14 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. మొదటి రౌండ్లో మల్క కొమురయ్యకు 7,601 ఓట్లు రాగా మహేందర్ రెడ్డి కి 4,024 వచ్చాయి.
రెండవ రౌండ్ లో కొమురయ్యకు 5,358 ఓట్లు రాగా మహేందర్ రెడ్డి కి 3,158 ఓట్లు వచ్చాయి. మొత్తం చెల్లిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో కొమురయ్యకు 12, 959 ఓట్లు సాధించడంతో విజయం సాధించారు. మల్కా కొమురయ్య గెలుపొందడంతో బిజెపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.