• ఢిల్లీలో మీడియాతో సిపిఐ పార్టీ జనరల్ సెక్రెటరీ డి.రాజా

న్యూఢిల్లీ-ఆంధ్రప్రభప్రతినిధి : రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన అత్యున్నత న్యాయనిపుణులలో ఒకరైన ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కోరారు.

త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా బుధవారం అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవితో కలిసి ఢిల్లీలోని సిపిఐ జాతీయ పార్టీ కార్యాలయానికి విచ్చేసి, వామపక్ష నేతలైన డి రాజా, నారాయణ, ఇంకా ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

సిపిఐ పార్టీ ఎంపీల మద్దతును జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం పార్టీ ఆవరణలో సిపిఐ నేత డి. రాజా మాట్లాడుతూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పూర్త మద్దతు ఇస్తుందని, దేశం మితవాద మతతత్వ ఫాసిస్ట్ శక్తుల తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నైతికతను సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు.

రాజ్యాంగంపై, మన సమాజంలోని లౌకిక ప్రజాస్వామ్య నిర్మాణంపై, అలాగే, దేశంలో సమాఖ్య పాలనా వ్యవస్థపై దాడి జరుగుతున్న వేళ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకంగా మారిందన్నారు. దేశం క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.

“ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా, ఎందుకు రాజీనామా చేశారో? మనందరికీ తెలుసునని.. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం వద్ద సమాధానం లేదు, ఇప్పుడు, ఆయన ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో, ఆయనకు ఏమి జరిగిందో తెలియదు”. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు డి. రాజా.

ఒకవైపు, మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, కానీ ఉపరాష్ట్రపతికి ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజా అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ ఎన్నిక అనివార్యం అయిందని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా బరిలో ఉండడం తాము సంతోషిస్తున్నామన్నారు.

Leave a Reply