కృష్ణా నదికి (Krishna River) వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం మరింత వేగం పుంజుకుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీ ఇన్‌ఫ్లో రావడంతో జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి పెద్ద మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం (09-08-2025) రాత్రి 9 గంటల వరకు, ప్రాజెక్టులోకి 1,25,000 క్యూసెక్కుల వరద నీరు (Inflow) వస్తోంది. వరద తీవ్రత కారణంగా అధికారులు అప్రమత్తమై, 13 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం (Srisailam) వైపు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా *92,997 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా *31,913 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కోయిలసాగర్ లిఫ్ట్ ద్వారా *315 క్యూసెక్కులు, ఆర్‌ఎమ్‌సి (RMC) ద్వారా **700 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కాల్వ ద్వారా *50 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. అన్ని డిమాండ్లు కలిపి 1,25,971 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు సామర్థ్యం) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 318.310 మీటర్లు (1,044.324 అడుగులు) వద్ద ఉంది. ప్రాజెక్టులో స్థూల నిల్వ *9.234 టీఎంసీలు, లైవ్ స్టోరేజ్ *5.527 టీఎంసీలు గా ఉంది.
వరద ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులు పర్యవేక్షణను మరింత కఠినతరం చేశారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.