ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జమ్మూలో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, ఆహారం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.
పిల్లలు, వృద్ధులు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. సహాయం కోసం ప్రజలు డాబాలపైకి ఎక్కి ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. పడవలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాని ఉపనదులు కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. నదీ తీరంలోని హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి.
మ్రాలి జిల్లాలోని వసిష్ట చౌక్ వద్ద జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. గ్రీన్ ట్యాక్స్ గ్రౌండ్ వద్ద వరద ఉద్ధృతికి షాపులను ఖాళీ చేయించారు. ఒక రెస్టారెంట్ కూడా వరదలో ధ్వంసం కాగా, కేవలం ముందు గోడ మాత్రమే మిగిలింది. అధికారులు ముందుగానే హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది.