జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు

జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు
చరిత్ర పితామహుడు మృతి పై చరిత్రకారులకు తీరనిలోటు
అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్
భీమ్‌గల్ రూరల్,ఆంధ్రప్రభ : ప్రముఖ చరిత్రకారుడు, కవి, రచయిత, చరిత్ర ఉపన్యాసకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు, జగిత్యాల పట్టణానికి చెందిన డాక్టర్ జైశెట్టి రమణయ్య (87) కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాల లోని తమ స్వగృహంలో శుక్రవారం మృతి చెందడంతో నిజామాబాద్ జిల్లాలోని చరిత్రకారులకు తీరని లోటు అని అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, రామన్నపేట భీమ్‌గల్ పట్టణంలో నివసిస్తున్న చరిత్ర గ్రంథ రచయిత, చరిత్ర పరిశోధకుడు కంకణాల రాజేశ్వర్ శనివారం విచారం వ్యక్తం చేశారు.
ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తనకు చరిత్ర పరిశోధనలో అత్యంత ఆత్మీయులైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కంకణాల స్మరించుకున్నారు. “కాలగమనంలో కోన సముద్రం” చారిత్రక గ్రంథ రచనలో విశేష కృషిచేసి స్వల్ప కాలంలోనే గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారని కంకణాల గుర్తు చేసుకున్నారు. బోధన్ కు చెందిన సిద్ధ సాయరెడ్డి రాసిన “నిజామాబాద్ జిల్లా చారిత్రక వైభవం” అనే చారిత్రాత్మక గ్రంథానికి అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. చరిత్ర పరంగా నిజామాబాద్ జిల్లాకు డాక్టర్ జైశెట్టి రమణయ్యతో అవినాభావ సంబంధం ఉంది. కొరవి గోపరాజు గురించి కూడా లోతైన పరిశోధన చేశారు. కరీంనగర్ జిల్లా పరిశోధనా పితామహుడిగా పేరుపొందిన డాక్టర్ జైశెట్టి రమణయ్య చరిత్ర పురుషుడు అని కంకణాల రాజేశ్వర్ అన్నారు.
