జై .. శ్రీ రాజరాజేశ్వరీ మాత
విజయవాడ, వెబ్ డెస్క్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది.
అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది.. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దూరహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంత్తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.
సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తిగా పురాణాలు చెబుతున్నాయి.. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చనలు ఆచరిస్తారు.. ఇక ఈరోజు నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.

