గత పాలనలో ఐటీడీఏ విధ్వంసం

  • ఇప్పుడు అభివృద్ధికి రూ.కోటి మంజూరు..
  • రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి… గుమ్మడి సంధ్యారాణి…


(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ) : గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, ఐటిడిఏ వ్యవస్థను నాశనం చేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhyarani) అన్నారు. బుధవారం శ్రీశైలంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కోటి రూపాయల నిధులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఏడు ఐటిడిఏ ప్రాజెక్టుల (ITDA projects) కు ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఒక్క ఏడాదిలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆధ్వర్యంలో ఐటీడీఏ అభివృద్ధి కోసం పది కోట్లు ఖర్చు పెట్టామన్నారు. గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి, గిరిజనుల జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలోని 102 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం (Marketing Center) గిరిజన సమాజానికి ఒక పెద్ద వరమవు తుందన్నారు. ఈ కేంద్రం పూర్తవుతే.. శ్రీశైలం, పరిసర ప్రాంతాల గిరిజన సమాజానికి సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కొత్త దిశ లభిస్తుందన్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, వనరులు, గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులు, హస్తకళలు , చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తుల (industries products) ను నేరుగా మార్కెట్‌కు చేరవేసే వేదికగా ఇది పనిచేస్తుందన్నారు.

దీనివల్ల 1500 మహిళలకు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారన్నారు. చెంచులు. యానాదులు, కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే తగిన ధరకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, గిరిజన యువతకు వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. అనంతరం నంద్యాల జిల్లా (Nandyal District)లోని ఆత్మకూరు పట్టణంలో నన్నారి జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్ ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు.

Leave a Reply