అన్నమయ్య జిల్లాలో దారుణం

అన్నమయ్య జిల్లా / పుంగనూరు, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు ఆ ఇంట్లో నవ్వులు వినిపించాయి.. పిల్లల ఆటలు కనిపించాయి. కానీ, ఆదివారం ఉదయం ఆ తలుపులు తెరుచుకున్నప్పుడు కనిపించిన దృశ్యం మాత్రం గ్రామాన్ని కన్నీళ్లలో ముంచెత్తింది. ఒక చిన్న అజాగ్రత్త పచ్చని కుటుంబాన్ని క్షణాల్లో మృత్యువు ఒడిలోకి నెట్టేసింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. త్యాగరాజు వీధికి చెందిన మురళి తన ద్విచక్ర వాహనానికి ఇటీవల ఇంజిన్ బోర్ చేయించాడు. బండి సెట్ కావాలంటే రాత్రంతా స్టార్ట్లో ఉంచాలని మెకానిక్ చెప్పడంతో ఇంట్లోనే స్టార్ట్ చేసి ఉంచాడు. కుటుంబ సభ్యులతో కలిసి తలుపులు మూసుకుని నిద్రపోయాడు. ఆ చిన్న నిర్ణయం ఆ కుటుంబానికి తిరిగిరాని దుఃఖాన్ని మిగిల్చింది. రాత్రంతా బండి నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు వారి ప్రాణాలను బలితీసుకుంది.
