కానిస్టేబులైతే మద్యం తాగి వాహనం నడపొచ్చా?

కానిస్టేబులైతే మద్యం తాగి వాహనం నడపొచ్చా?
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను ఆటోడ్రైవర్ గట్టిగా నిలదీశాడు. కానిస్టేబుల్ కు ప్రశ్నల వర్షం కురిపించి చుక్కలు చూపించాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ ఎదుట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సేకరించిన సమాచారం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ విధులు ముగించుకుని ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ మద్యం తాగి ద్విచక్ర వాహనం పై విజయవాడ బయలుదేరాడు. మార్గమధ్యలో గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ వద్ద బారికేడ్ ను ఢీకొని కిందపడిపోయాడు. అతని పైకి కారు దూసుకెళ్లింది. త్రుటిలో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ గమనించి ఆ కానిస్టేబుల్ ను లేపి పంపించాడు. వెంటనే మరో బారికేడ్ ను ఢీకొట్టిన కానిస్టేబుల్ మళ్లీ పడిపోయాడు. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ గట్టిగా నిలదీయగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న విషయం బయటపడింది. దీంతో ఆ ఆటోడ్రైవర్.. హెల్మెట్ ధరించకపోయినా, మద్యం తాగి వాహనం నడిపినా, డ్రెస్ కోడ్ లేకపోయినా రూ.వేలకు వేలు జరిమానాలు విధిస్తున్నారని, కానిస్టేబుల్ అయి ఉండి హెల్మెట్ ధరించకుండా, మద్యం తాగి వాహనం నడపవచ్చా? అని నిలదీశాడు. మీకు ఎంత జరిమానా? ఎవరు విధించాలని ప్రశ్నించాడు.
కానిస్టేబుల్ పేరు, ఐడీ కార్డు చూపాలని డిమాండ్ చేశాడు. కానిస్టేబుల్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. దీంతో మరో కానిస్టేబుల్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఆ కానిస్టేబుల్ ను కడిగి పారేశాడు. సమాజాన్ని బాగు చేయాల్సిన పోలీసులే ఇలా తాగి తందనాలాడితే ఎలా అంటూ వాగ్వాదానికి దిగాడు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన పై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
