సుబ్బారాయుడు ఆగమనం
( ఆంధ్రప్రభ, తిరుపతి క్రైం )
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పధ్నాలుగు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం మార్చగా, మరో పన్నెండు జిల్లాల ఎస్పీలను యథాతథంగా కొనసాగించింది. ఈ బదిలీల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియామకం తిరుపతి జిల్లా ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని నియమించడం. ఇప్పటికే ఆయన కొంతకాలం తిరుపతి ఎస్పీగా పనిచేశారు. కానీ తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం అత్యవసర చర్యలలో భాగంగా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. అయితే ఇటీవల ఆ ఘటనపై వచ్చిన రిపోర్టులో సుబ్బారాయుడుకు బాధ్యత లేదని తేలడంతో మళ్లీ తిరుపతి ఎస్పీగా నియమించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడు స్వస్థలం అనంతపురం జిల్లా బండమీదపల్లె. ఆయన ఏపీలో పని చేయాలన్న ఉద్దేశంతోనే డిప్యూటేషన్‌పై వచ్చారు. మొదటిసారి కూడా తిరుపతి ఎస్పీగా ఆయనకు పోస్టింగ్ లభించింది. తిరుపతిలో కఠినంగా వ్యవహరించే అధికారి అన్న పేరును సంపాదించుకున్నారు. వైసీపీ నేతల అవినీతి అంశాలపై జరుగుతున్న సిట్ విచారణల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. సుబ్బారాయుడు కఠినంగా వ్యవహరిస్తారని, ఆరోపణలకు తావు ఇవ్వరని అధికారులు చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సైతం ఆయనను బహిరంగంగానే విమర్శిస్తూ హెచ్చరికలు జారీ చేయగా, సుబ్బారాయుడు కూడా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఆయన మళ్లీ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లా వైసీపీ నేతల్లో కంగారు మొదలయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

