IPS POLICE | నిరంతర నిఘా..

IPS POLICE | నిరంతర నిఘా..

IPS POLICE | గద్వాల, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని షేక్‌పల్లి, కొండేరు, ఉండవెల్లి, లింగానవాయి, కాత్యురు, మనోపాడు గ్రామాలలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనల మేరకు జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. ఉండవెల్లి గ్రామంలో ఓటు వేసి వస్తున్న 78 సంవత్సరాల వయస్సు గల ఓటరు వేణుగోపాలచారితో జిల్లా ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి, ఓటు హక్కు వినియోగించినందుకు అభినందించారు.

వృద్ధులు, మహిళలు, వికలాంగ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ పూర్తైన అనంతరం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఉండవెల్లి లింగానవాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అలాగే కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, నిబంధనల అమలు పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సంబంధిత పోలింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతతో నిరంతర నిఘా కొనసాగిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply