Invitation | మేడారం జాతరకు ఆహ్వానం

Invitation | మేడారం జాతరకు ఆహ్వానం
- బక్కి వెంకటయ్యకు ఆహ్వాన పత్రిక, తీర్థప్రసాదాలు అందజేసిన మంత్రి సీతక్క
Invitation | ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను, తీర్థప్రసాదాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళా సమ్మక్క– సారలమ్మ జాతరలో పాల్గొని, వనదేవతల కృపకు పాత్రులు కావాలని మంత్రి సీతక్క చైర్మన్ బక్కి వెంకటయ్యను ఆహ్వానించారు. రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ మహా జాతరలో ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని ఆమె కోరారు. సమ్మక్క– సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, గిరిజనుల ఆరాధ్య దైవాలైన వనదేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శుభ ఫలితాలు కలగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
ఈ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి సీతక్క ఆహ్వానాన్ని స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సమ్మక్క– సారలమ్మ జాతరలో తప్పకుండా పాల్గొని వనదేవతల ఆశీస్సులు పొందుతానని తెలిపారు. జాతర నిర్వహణ విజయవంతం కావాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
