పట్టుబడ్డాడిలా…

ఉమ్మడి అదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ లో సోమవారం అర్ధరాత్రి డిబిఎస్ ఏటీఎం (ATM)లో చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడిని ఈ రోజు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిప్లబ్ కుమార్ జేన అనే నిందితుడు 2011 నుండి 2015 వరకు అదిలాబాదులోని పలు రెస్టారెంట్లలో వర్కర్ గా పనిచేసి ఏటీఎం చోరీకి పథకం రూపొందించారని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి (DSP JeevanReddy) తెలిపారు.
కిసాన్ చౌక్ లోని ఏటీఎం గునపంతో ధ్వంసం చేయగా అలారం మోగడంతో భయపడి పరుగు తీశారని తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఠాకూర్ హోటల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ (CI Sunil Kumar) ఆధ్వర్యంలో పట్టుకున్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, ఓ గడ్డపార, ఏటీఎం కార్డ్ స్వాధీనం చేసుకున్నట్టు జీవన్ రెడ్డి వివరించారు.
