సంగారెడ్డి : జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల కోసం 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో 34,614 బండి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించడంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది, అత్యవసర మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందరాం, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు ఉన్నారు.