ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు..

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు..

భద్రతా ప్రమాణాల పరిశీలన పాటించకపోతే కఠిన చర్యలు. .
.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ):
ఇటీవల కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం నేపథ్యంల, ప్రైవేట్ మరియు ఆర్టీసీ టూరిస్ట్ బస్సుల పై భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలలో ప్రయాణించే బస్సుల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.

తనిఖీల్లో కీలక చర్యలు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు బృందాలు విస్తృతంగా బస్సులను తనిఖీ చేస్తున్నాయి. ట్రావెల్స్ బస్సుల పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా పరికరాలు, అగ్నిమాపక పరికరాలు వంటి అంశాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల పై చర్యలు తీసుకోనున్నామని అధికారులు స్పష్టంచేశారు.

ఫేస్ వాష్ అండ్ గో పథకం..
రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక పద్ధతిలో ఫేస్ వాష్ అండ్ గో.. కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–చెన్నై నేషనల్ హైవేలు (ఎన్ హెచ్-40, ఎన్ హెచ్-44) పరిధిలోని పుల్లూరు, అమకతాడు, నన్నూరు టోల్‌గేట్ల వద్ద ఈ కార్యక్రమం జరిగింది. లారీలు, బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, బొలెరో వాహనాలను ఆపి, డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగేలా చేసి, తదుపరి ప్రయాణాన్ని కొనసాగించేలా సూచించారు.

డ్రైవర్లకు అవగాహన..
నిద్ర మత్తులో వాహనం నడపడం ప్రమాదకరం. కుటుంబాన్ని గుర్తుచేసుకొని, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. హైవేలపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసుల ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Leave a Reply