- శివాలయం వద్ద సొంత నిధులతో బోరు వేయించిన యువకుడు
నారాయణపేట రూరల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో త్రాగునీటి సమస్యను గమనించిన బీజేపీ నాయకుడు సత్య రఘుపాల్ రెడ్డి తనయుడు సూరజ్ సుతారి సేవాభావంతో ముందడుగు వేసి శివాలయం ప్రాంగణంలో సొంత ఖర్చులతో బోరు వేయించి నీటి సదుపాయం కల్పించారు.
ప్రజల దాహార్తిని తీర్చడంలో సూరజ్ చూపిన సామాజిక బాధ్యత యువతకు స్ఫూర్తిదాయకమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న కొంత మంది యువతరం ఇలాంటి సేవా కార్యక్రమాల వైపు మొగ్గుచూపితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.
దేవాలయ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి అవసరాన్ని గుర్తించి ముందుకు వచ్చిన సూరజ్ సమాజ సేవలో తన కర్తవ్యాన్ని చాటుకున్నాడని పెద్దలు పేర్కొన్నారు. శివాలయం వద్ద ఏర్పాటు చేసిన నీటి సౌకర్యం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

