ప్రైవేటు బస్పుల తనిఖీ
- ఏపీలో 289 కేసులు నమోదు
- 18 బస్సులు స్వాధీనం
- రూ.7.08 లక్షల జరిమానా
ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ఆహుతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాగోతాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్ల(Toll gates) దగ్గర తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, బస్సులో ఎలక్ట్రానిక్ పరికరాల రవాణా తదితర అంశాలన్నింటినీ క్షుణంగా తనిఖీ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్(private travels)కు భారీగా జరిమానాలు విధించారు. సుమారు రూ.7.08 లక్షల జరిమానా విధించారు. ఏలూరులో అత్యధికంగా 55 కేసులు నమోదు చేశారు.
శుక్రవారం అర్ధ రాత్రి ఏలూరు జిల్లా కలపర్రు టోల్ గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. 55 బస్సుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయగా, వీటిలో మూడు బస్సులను సీజ్ చేశారు. ఈ 55 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 2.50 లక్షలు జరిమానా విధించినట్టు డీటీసీ కరీముల్లా(DTC Karimulla) తెలిపారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ.. కేవలం కర్నూలు ఘటన నేపథ్యంతోనే కాకుండా ప్రతినిత్యం నిఘా సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారని, 2025 లో ఇప్పటి వరకు 946 కేసులు నమోదు చేశారని, రూ.59 లక్షలు పెనాల్టీ(Penalty) వసూలు చేసినట్లు తెలిపారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు, 4 బస్సులు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లా(Kurnool District)లో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్ లిస్టు లేని 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు ఆర్డీఏ అధికారులు కేసు నమోదు చేశారు.

