Indrakeeladri | వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం..

Indrakeeladri | వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం..
- శష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు..
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజు మాఘ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి నెలా షష్ఠి తిథి సందర్భంగా నిర్వహించే సంప్రదాయంలో భాగంగా మహా మండపంలోని 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శాస్త్రోక్త విధానంలో అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కల్యాణార్థం క్రతువును నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అలాగే ధర్మకర్తల మండలి మహిళా సభ్యులు గుడపాటి వెంకట సరోజిని దేవి, మన్నె కళావతి, పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహా మండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కళ్యాణ మహోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు.

