భగవద్గీత సందేశంతో సంసార జీవితం సార్థకం..

భగవద్గీత సందేశంతో సంసార జీవితం సార్థకం..

కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ సందేశం..
కనకదుర్గమ్మ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ధర్మ ప్రచారంపై ఆధ్యాత్మిక ఉపదేశం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. భగవద్గీత, విష్ణు సహస్రనామం, రామనామ జపం వంటి సనాతన ధార్మిక మార్గాలను ఆచరిస్తే సంసార జీవితం సార్థకమవుతుందని ఆయన పేర్కొన్నారు. శంకరాచార్యుల ఉపదేశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారు.

భజగోవిందం భజగోవిందం అనే ఆది శంకరాచార్యుల సందేశం ద్వారా భక్తి మార్గాన్ని ప్రజలకు తెలియజేశారని గుర్తుచేశారు. భక్తి, సత్సంగం, దానధర్మం వంటి విలువలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని వివరించారు.ఆది శంకరాచార్యుల ప్రసిద్ధ బోధనలో ఉన్న గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం అనే శ్లోకం ద్వారా భగవద్గీత, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలని, సత్సంగం చేయాలని, పేదలకు దానం చేయాలని సూచించారని స్వామీజీ చెప్పారు.

ఇవి మనిషి జీవితాన్ని ధర్మపథంలో నడిపించే ముఖ్య మార్గాలని ఆయన పేర్కొన్నారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయని, వాటిని ఒకసారి చదవడం మాత్రమే కాకుండా ప్రతిరోజూ కొద్దిగా అయినా చదివి మననం చేయాలని స్వామీజీ సూచించారు. భగవద్గీత కించిదధీత అనే శంకరాచార్యుల బోధన ప్రకారం కొద్దిపాటి శ్లోకాలైనా చదివి ఆ భావాన్ని జీవితంలో ఆచరించాలని ఆయన వివరించారు. యజ భజ అనే భావం ప్రకారం పూజలు, హోమాలు చేయడమే కాకుండా రామనామ సంకీర్తనం, శివనామ జపం, హరి నామ స్మరణ వంటి భక్తి మార్గాలను అనుసరించాలని తెలిపారు.

శివ శివ… హరి హరి… రామ్ రామ్ రామ్ నామస్మరణ మనసుకు ప్రశాంతతను ఇస్తుందని అన్నారు. సంసార జీవితంలో కోరికలు, అవసరాలు సహజమని, అయినప్పటికీ మన జీవితం ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని స్వామీజీ సూచించారు. పరోపకారం, త్యాగం, సత్సేవ వంటి విలువలు జీవితం సార్థకం చేసే మార్గాలని పేర్కొన్నారు. ఆది శంకరాచార్యులు యావత్ భారతదేశం పాదయాత్రగా సంచరించి అద్వైత తత్వం, మైత్రి, సద్భావనలను ప్రచారం చేశారని స్వామీజీ గుర్తు చేశారు. దేశంలో ధర్మం, ఐక్యత, శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషి అపారమని అన్నారు.

ధార్మిక సంప్రదాయాలలో రామనామ లేఖన యజ్ఞం ముఖ్యమైన సాధనగా పురాణాలలో పేర్కొనబడిందని స్వామీజీ తెలిపారు. వాల్మీకి మహర్షి రచించిన వాల్మీకి రామాయణంలో కూడా భక్తితో రామనామం లిఖిస్తే పుణ్యం లభిస్తుందని చెప్పబడిందని వివరించారు. కంచి పీఠం ద్వారా గతంలో రామనామ లేఖనాన్ని విస్తృతంగా ప్రోత్సహించారని, భక్తులు రామనామం రాయడం ద్వారా భక్తి భావాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చని తెలిపారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాల సారాంశం భగవద్గీతలో నిక్షిప్తమై ఉందని స్వామీజీ పేర్కొన్నారు.

గీతా భావాన్ని అర్థం చేసుకుంటే సనాతన వైదిక ధర్మం యొక్క అసలు తత్వం మనకు అవగతమవుతుందని తెలిపారు. భగవద్గీత సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ధర్మబోధనను బలపరచవచ్చని స్వామీజీ అభిప్రాయపడ్డారు.హర హర శంకర… జై జై శంకర అంటూ స్వామీజీ తన ఆధ్యాత్మిక సందేశాన్ని ముగించారు.

Leave a Reply