ఇందిరమ్మ ఇండ్లతో పేదల గృహ కల సహకారం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి సూచించారు. నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రంగాపురం గ్రామానికి చెందిన పెద్దొజు రామరమణాచారి కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం నిర్వహించగా, స్థానిక ప్రజలు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిట్యాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పేదల గృహ కలలను సాకారం చేసే ఇందిరమ్మ పథకం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కుసుంబ రఘుపతి, వీఎఫ్‌జీ నల్లబెల్లి అధ్యక్షుడు పోలుదాసరి శ్రీనివాస్, నాయకులు డ్యాగల కృష్ణ, వార్డు సభ్యులు కుసుంబ విశ్వతేజ, మండల సుజాతతో పాటు గ్రామ నాయకులు ముత్తిరెడ్డి యాదవరెడ్డి, బండారి రాజమౌళి, గోగులోతు రాజు తదితరులు పాల్గొన్నారు.
