నంద్యాల బ్యూరో, జులై 22 (ఆంధ్రప్రభ) : నంద్యాల (Nandyala) జిల్లాలోని శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నీటిమట్టం క్రమేపి రోజు రోజుకు పెరుగుతుంది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు సైరన్ (Siren) మోగించారు. ఎగువ ప్రాంతం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జలాశయంలోకి నీరు వస్తుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 883.90 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఒంటిగంట ప్రాంతంలో ఒక రేడియల్ క్రస్ట్ గేటు పది అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ కు కిందికి నీరు వదిలారు. మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది రెండవసారి గేట్లను ఎత్తేందుకు సిద్ధమయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈనెల 8వ తేదీన శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి 4 గేట్లను ఎత్తి సాగర్ కు నీరు వదిలారు. వరద తగ్గుముఖం పట్టడంతో 15వ తేదీన గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి 87,535 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇందులో జూరాల (Jourala) నుంచి 35,157 క్యూసెక్కుల నీరు, స్పిల్ వే నుంచి 11,967 క్యూసెక్కుల నీరు, సుంకేసుల ప్రాజెక్టు (sunkesula project) నుంచి 39,411క్యూసెక్కుల నీరు జిలాశయంలోకి వస్తుంది.
కుడి ఎడమల జల విద్యుత్ ప్రాజెక్టుకు 67,346 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుడి విద్యుత్ ఉత్పత్తికి 32,031 క్యూసెక్కుల నీటిని విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఎడమ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జలాశయం పూర్తిగా నిండుకుండలా ఉండటంతో నేటి సాయంత్రం లోపల గేట్లనే పరిస్థితి రావచ్చు అని అధికారులు తెలుపుతున్నారు.