కనకదుర్గమ్మకు కానుకుల వర్షం..

కనకదుర్గమ్మకు కానుకుల వర్షం..

  • ఇంద్రకీలాద్రిపై భక్తుల హుండీ కానుకలు వెల్లువ
  • 19 రోజుల్లో రూ.3.30 కోట్లకు పైగా ఆదాయం…
  • రోజుకు సగటు రూ.17.42 లక్షలు.
  • భారీగా వెండి బంగారం డాలర్లు విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ కు భక్తులు పెద్ద ఎత్తున కానుకల సమర్పించడంతో కానుకల వర్షం కురిసింది. ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే భక్తులు అమ్మవారికి కానుకలను పెద్ద ఎత్తున సమర్పిస్తుండగా సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి సమర్పణలు నమోదయ్యాయి.

మార్చి 11 నుంచి మార్చి 30 వరకు మొత్తం 19 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించగా, నగదు రూపంలో రూ.3,30,98,699 లభించింది. ఇందులో కరెన్సీ నోట్ల రూపంలో రూ.3,14,81,699, నాణేల రూపంలో రూ.16,17,000 నమోదయ్యాయి. రోజుకు సగటున రూ.17,42,036 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీటితో పాటు భక్తులు బంగారం 275 గ్రాములు, వెండి 3 కిలోల 275 గ్రాములు సమర్పించారు.

విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించింది. అమెరికా డాలర్లు 627, యూరోలు 50, మలేషియా రింగిట్ 100, సింగపూర్ డాలర్లు 27, యూఏఈ దిర్హామ్స్ 40, కువైట్ దినార్ 2, కెనడా డాలర్లు 5, సౌది రియాల్ 100 సమర్పించబడినట్లు తెలిపారు. పాత కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్లు 3 లభించినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈవో వి.కే. శీనా నాయిక్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించగా హుండీ లెక్కింపులో ఏసీ రంగారావు దేవస్థానం ఏఈవోలు సూపర్డెంట్లు ఇతర అధికారులు సేవకులు ఎస్పీఎఫ్ వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply