WOMEN | మహిళా భాగస్వామ్యంతోనే సమ్మిళిత వృద్ధి

ఏడీసీ కార్యాలయంలో పోష్ చట్టం కార్యశాల

WOMEN | అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ :⁠ ఏదైనా ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలు భద్రతా భావాన్ని కలిగిఉండి వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరిస్తే అక్కడ ఆర్థిక సాధికారత మరియు సమ్మిళిత వృద్ధి జరుగుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి అన్నారు. దేశంలో పని ప్రదేశాలలో POSH చట్టం (లైంగిక వేధింపుల నిరోధక చట్టం) మహిళలపై లైంగిక వేధింపులు, నియమాలపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఉద్యోగులకు, సిబ్బందికి శుక్రవారం ఒకరోజు వ‌ర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళలకు పనిచేసే చోట సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం – 2013 లక్ష్యం అన్నారు.

మహిళా ఉద్యోగినులు తమ ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కులను ఉపయోగించుకోవడానికి ఈ చట్టం తోడ్పడుతుంది. అదేవిధంగా ప్రతిచోటా పని పరిస్థితులలో లింగ సమానత్వం, జీవితం, స్వేచ్ఛ, సమానత్వంపై వారి హక్కును గ్రహించడానికి దోహదం చేస్తుందన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షించబడటానికి పోష్ చట్టం పదునైన ఆయుధంగా తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తదితర రంగాలలో యజమానులు నిర్వహణ, పర్యవేక్షణ, కార్యాలయ నియంత్రణ మరియు విధానాల రూపకల్పనకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులలో లింగ సమానత్వం తగినంత విస్తృతిని కలిగి ఉందన్నారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం లైంగిక వేధింపులను నిర్వచించి, యజమానుల బాధ్యతలను వివరిస్తూ మార్గదర్శకాలను రూపొందించింద‌న్నారు. పని ప్రదేశంలో స్త్రీ లైంగిక వేధింపులకు గురైనా పోష్ చట్టం రక్షణ కవచంలా నిలుస్తోందన్నారు.

ఏడీసీ జనరల్ మేనేజర్ కె.శ్రీహరి మాట్లాడుతూ అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. సంబంధిత ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీని నియమించామన్నారు. ఈ కార్యశాలలో ఏడీసీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎల్ఎస్వి భవన్నారాయణ, ఐసీసీ కమిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాణి ఫణిశ్రీ, ఐసీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply