పోక్సో కేసుల్లో న్యాయస్థానం కఠిన తీర్పులు…

పోక్సో కేసుల్లో న్యాయస్థానం కఠిన తీర్పులు…

  • జిల్లాలో జరిగిన వేరు వేరు ఘటనల్లో..
  • ఒకరికి జీవిత ఖైదు…
  • మరొకరికి 20 ఏళ్ల జైలు శిక్ష
  • మహబూబ్‌నగర్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థాన ముద్ర

మహబూబ్ నగర్,క్రైం, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ మహబూబ్‌నగర్‌లోని ప్రత్యేక సెషన్స్ కోర్టు (అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కార న్యాయస్థానం) కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి తమన్ రాజా రాజేశ్వరి విచారణ పూర్తి చేసి పటిష్ట ఆధారాలపై నిందితులకు శిక్షలు విధించారు.

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 07.05.2023న నమోదైన కేసులో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోర అత్యాచారం ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడు వరణాసి రాములకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.20,000 నగదు జరిమానా విధించింది. అదనంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

రాత్రి సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న చిన్నారిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్ష్యాధారాలు సేకరించి కేసును దృఢంగా కోర్టులో ప్రవేశపెట్టారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. అలాగే జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.17/2021 కేసులో 14 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి కర్నూలు, తిరుపతి ప్రాంతాలకు తీసుకెళ్లిన ఘటనపై కోర్టు నిందితుడు ఎం.డి. సలీంకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.

బాలిక గల్లంతైన ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు శీఘ్ర చర్యలు చేపట్టి ఆమెను సురక్షితంగా గుర్తించి, స్టేట్‌మెంట్ నమోదు చేసి, పటిష్టమైన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో అన్ని అంశాలు రుజువుకావడంతో కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ రెండు కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన ప్రత్యేక ప్రజా అభియోగ అధికారి ఎం. జాన్ ను, సంబంధిత డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, కోర్టు లైజన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డి. జానకి పేరుపేరున అభినందించారు. బాలలపై లైంగిక దాడుల వంటి అమానుష నేరాల విషయంలో జిల్లా పోలీసులు రాజీ లేకుండా కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply