AP | SPL STORY | గ్రామాల్లో ప్రగతి కళ…

  • రైతుల జీవన ప్రమాణాలు పెంపు కార్యక్రమాల అమలు.

కర్నూలు బ్యూరో : పల్లె సీమల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో కూటమి సర్కార్… పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో నూతన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల అభివృద్ధికి ఒక కీలక ముందడుగు వేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024 ఆగస్టు 23న కర్నూలు జిల్లాలోని 484 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి పల్లె సీమలలో ఉపాధి హామీ పథకం ద్వారా కర్నూలు జిల్లాలో రూ.131.28 కోట్లతో గోకులాలు, ఫారం పాండ్లు, ఉద్యాన పండ్ల తోటల పెంపకం, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడానికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శరవేగంగా పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశారు.

ఈ మేరకు గ్రామాలలో సుస్థిర ఆస్తుల కల్పన నిమిత్తం విస్తృతంగా పనుల అమలుకు జిల్లా యంత్రాంగాన్ని వేగవంతం చేశారు. డ్వామా, పంచాయతీరాజ్ శాఖలను సమన్వయపరిచి గ్రామీణ ప్రాంతంలో రైతుల జీవన ప్రమాణాలు, నికర ఆదాయ మార్గాల పెంపుదల కార్యక్రమాల అమలును ముమ్మరం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో గోకులాలు, ఫారం పాండ్లు, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపట్టడంతో రైతులు, ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

పాడి రైతుల కోసం గోకులాలు

రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల ప్రయోజనార్థం గోకులం నిర్మాణాలను చేపట్టింది.. జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు తమ స్థలం అనుకూలతను బట్టి గోకులం నిర్మాణానికి రెండు పశువులు ఉన్నవారికి యూనిట్ ధర రూ.1.15 లక్షలు, నాలుగు పశువులు కలిగిన వారికి రూ.1.85 లక్షలు, ఆరు పశువులు కలిగిన వారికి రూ.2.30 లక్షలు ఉపాధి మెటీరియల్ నిధులు మంజూరు చేశారు.

ఇందులో కేవలం రైతులు 10 శాతం భరించగా, మిగిలిన 90 శాతం ఉపాధి నిధుల నుంచి మంజూరు చేశారు. అదేవిధంగా 20 గొర్రెలు/మేకలకు షెడ్లు వేసుకునే వారికి యూనిట్ ధర రూ.1.30 లక్షలు, 50 గొర్రెలు/మేకలు కలిగిన వారికి రూ.2.30లక్షలు, అలాగే కోళ్ల ఫారాలకు 100 కోళ్లు పెట్టుకున్న వారికి షెడ్డు నిర్మాణానికి ఒక యూనిట్ కు రూ.87 వేలు, 200 కోళ్లు ఉన్నవారికి రూ.1.32 లక్షలు మంజూరు చేశారు.

మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీతో ఉపాధి నిధులను మంజూరు చేశారు. జిల్లాలో మొత్తంగా 1020 షెడ్ల నిర్మాణానికి రూ.21.92 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.. ఇప్పటికే 605 షెడ్లు నిర్మాణం పూర్తికాగా… మిగిలినవి తుది దశలో ఉన్నవి.

ఫారం పాండ్లు, ఉద్యాన తోటల పెంపకం

అలాగే జిల్లాలో రూ.4.5 కోట్ల అంచనాతో 1252 ఫారం పాండ్లు మంజూరు కాగా… 274 పనులు చేపట్టి ఇప్పటికే 53 పనులను పూర్తి చేశారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సన్న చిన్న కారు రైతుల సుస్థిర అభివృద్ధి కోసం రూ.37.36 కోట్ల అంచనాతో 4152 ఎకరాలలో 100 శాతం రాయితీతో మామిడి, సపోటా, చీని, నిమ్మ తదితర పండ్ల తోటల పెంపకం పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది.

పల్లె పండుగ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో రూ.67.58 కోట్లతో గ్రామాలలో సిమెంట్ రహదారులు, బీటి రహదారులు, డబ్ల్యూబిఎం రహదారులు, ప్రహరీ గోడల నిర్మాణం తదితర పనులకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 830 పనులలో… 790 పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు త్వరలో పూర్తి కానున్నాయి.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాభివృద్ధి

జిల్లాలో గ్రామాభివృద్ధికి తోడ్పడే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేయడం జరుగుతోంది..గోకులం నిర్మాణాలు, ఫారం పాండ్స్, ఉద్యాన తోటల పెంపకం, సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టడం జరుగుతోంది.

ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పనుల కల్పన ద్వారా ఇప్పటి వరకు వేతనాల రూపంలో రూ.211 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.73 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో రోడ్ల నిర్మాణంతో పాటు రైతుల నికర ఆదాయ మార్గాల పెంపుదల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మినీ గోకులం పాడి రైతులకు వరం

-మహబూబ్ బాషా, తడకనపల్లి గ్రామం, కల్లూరు మండలం

‘‘మా సొంత స్థలంలో 6 పశువులకు మినీ గోకులం నిర్మించుకున్నా.. యూనిట్ విలువ 2,30,000 కాగా, ఉపాధి హామీ పథకం కింద 90% సబ్సిడీతో 2,07,000 రూపాయలు మంజూరు చేశారు. 23,000 రూపాయలు రైతు వాటా కింద జమచేసి మినీ గోకులం నిర్మాణం పూర్తి చేశాను.

ఇంతకుముందు నా వద్ద ఉన్న గేదెలు, ఆవులన్నీ కూడా చెట్టు కింద ఖాళీ స్థలంలో కట్టివేసేవాడిని అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బంది పడుతూ ఉండేవి.. వాటి ఆరోగ్యం పాడైపోతూ ఉండేది. అంతేకాకుండా పాల దిగుబడి కూడా తక్కువగా ఉండేది.

ఇప్పుడు మినీ గోకులం నిర్మాణం పూర్తయిన తర్వాత పశువులు పరిశుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పాల దిగుబడి కూడా సుమారుగా ఒక్కొక్క పశువు కి రెండు లీటర్ల చొప్పున పెరిగినాయి, అలాగే పశువులు పాము కాటుకి గురికాకుండా, క్రిమి కీటకాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నాయి.

మినీ గోకులంలో నీటి తొట్లు ఏర్పాటు చేసినందువల్ల అవి పుష్కలంగా నీరు తాగుతూ ఆహారం బాగా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాయి. అలాగే మినీ గోకులంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయడం వల్ల దోమలు, ఈగల బెడద తప్పి పశువుల ఆరోగ్యంగా ఉన్నాయి.

అలాగే పశువులు పోసిన మూత్రము, పశువులను కడిగిన నీరు అంతా కూడా గోకులం షెడ్ లోని కాలువల ద్వారా వెంటనే బయటికి పోవడం వల్ల షెడ్ లో తేమ లేకుండా పొడిగా ఉండి శుభ్రంగా ఉంటున్నాయి దాని వలన పొదుగు వాపు వ్యాధి రావడం కూడా తగ్గింది. నా పశువులకు ఇంత మేలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ, ఉపాధి హామీ పథకం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’

చాకలి సుంకన్న, రైతు, పొట్లపాడు గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా.

మాకు ఉన్న మూడు ఎకరాలలో ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి పండ్ల మొక్కలు నాటడానికి గుంతలు తీయించారు, అనంతరం ప్రభుత్వం వారే మొక్కలను, మొక్కలకు అవసరమైన ఎరువులను, సరఫరా చేశారు, మా పొలమును దున్నుకోవటానికి ఎకరా కు 1000 రూపాయల చొప్పున నగదును కూడా ఇచ్చారు.. చాలా సంతోషంగా ఉందని రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చాకలి సుంకన్న.

కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో సిసి రోడ్లు

గ్రామాలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలోని రహదారులను నిర్మించి గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు..మా గ్రామంలో బోయ మద్దిలేటి ఇంటి నుండి మసీదు వరకు సిసి రోడ్ ను నిర్మించారు..రోడ్ వేయడం వలన చాలా సౌకర్యంగా ఉందని ఓర్వకల్లు మండల కేంద్రానికి చెందిన రఘురాముడు, సుబ్బరాయుడు రాష్ర్ట ప్రభుత్వాన్ని అభినందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *