IFP Panels | మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం..

IFP Panels | మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం..
IFP Panels | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ(Collector DK Balaji) విద్యాధికారులకు సూచించారు. మెగా పీటీఎమ్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నగరంలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధానోపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి చేపట్టవలసిన అంశాల పై దిశా నిర్దేశం చేశారు. తొలుత నగరంలోని రాజుపేట నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.ఎన్(F.L.N) ( ఫౌండేషన్ లిటరసి న్యూమరసి) బేస్ లైన్ పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం దేశాయిపేటలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన విజ్ఞానాన్ని కలిగించే జాదూయి, పితారా, వివిధ రకాల పరికరాలను, క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడా సామాగ్రిని పరిశీలించారు. మెగా పేరెంట్ టీచర్స్(Parent Teachers) సమావేశానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ సమాచారం అందించారా లేదా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు సజావుగా చేస్తున్నారా లేదా అని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను విచారించారు.
విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ కార్డులు(Holistic Cards), బేస్ లైన్ పరీక్షల నివేదికలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో అవగాహన కలిగించాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశానికి మంత్రివర్యులు కూడా వస్తారని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఐ ఎఫ్ పి ప్యానెల్స్(IFP Panels) ద్వారా విద్యను బోధిస్తున్న విధంగానే వివిధ రకాల పరికరాలను ఉపయోగించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలన్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ ఈవో శేఖర్ సింగ్, ఎంఈఓ లు దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, శోభారాణి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సిఆర్పి యూనస్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

