అలా చేస్తే.. చర్యలు తప్పవు..

అలా చేస్తే.. చర్యలు తప్పవు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అంబులెన్స్ డ్రైవర్‌లు రోగుల నుంచి అధిక ధరలు వసూళ్ళు చేసినట్లు తెలిస్తే తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని బందరు ఇన్‌చార్జ్ డిఎస్పీ ధర్మేంద్ర నగరంలోని అంబులెన్స్ డ్రైవర్‌లను హెచ్చరించారు. మచిలీపట్నంలోని ఆయన తన కార్యాలయంలో నగరంలోని అంబులెన్స్ డ్రైవర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు హెచ్చరికలు జారీ చేశారు. అంబులెన్స్ డ్రైవర్‌ల సేవలు ఉన్నతమైనవిగా ఉండాలన్నారు. రోగుల అత్యవసరాలను ఆసరాగా తీసుకుని అధిక ధరలు వసూలు చేస్తే మాత్రం యాక్షన్ సీరియస్‌గా ఉంటుందన్నారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీలు కఠినంగా ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి వద్ద కొంత మంది అంబులెన్స్ డ్రైవర్‌లు పేద రోగుల నుంచి అయిన కాడికి డబ్బులు దండుకుంటున్నట్లు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌కు పీజిఆర్‌ఎస్‌లో ఫిర్యాదు అందినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబులెన్స్ డ్రైవర్‌లు రోగుల నుంచి న్యాయబద్దంగా డబ్బులు తీసుకోవాలని సూచించారు. అందుకు వ్యతిరేఖంగా వసూళ్ళు చేస్తున్నట్లు తెలిసినా, మరలా ఫిర్యాదులు అందినా సంబంధిత డ్రైవర్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్టీవో శ్రీనివాసరావు డిఎస్పీతో కలిసి పాల్గొన్నారు.
