TG | ప్ర‌శ్నిస్తే కేసులు… ఇదే రేవంత్ పాల‌న… ఎమ్మెల్సీ క‌విత ఫైర్

  • జైలులో ఉన్న ల‌క్కినేని సురేంద‌ర్ కు ప‌రామ‌ర్శ
  • పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా
  • హామీలు అమ‌లు చేయ‌మంటే అరెస్ట్ లే చేస్తున్నారు
  • కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు
  • కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు
  • ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు: ఎమ్మెల్సీ కవిత

ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత ఫైరయ్యారు. ఎన్ని కేసులు పెట్టనా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నేడు ప‌ర్య‌టిస్తున్న ఆమె ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్టీ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. 14నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి వెలగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

‘మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం.. ఒక్క సురేందర్‌కే కాదు, రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజాక్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు.

కొందరిని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్లు భావిస్తున్నారు. రైతుబంధు రాలేదు, బీమా రాలేదు, ఫించన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14నెలల పాలనలో దొంగహమీలే తప్ప చేసింది లేదు. క‌చ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉందాం.’ అని కవిత ఫైరయ్యారు. అనంత‌రం ఆమె ఖమ్మంలో జ‌రిగిన బీసీ రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొన్నారు.

కోమ‌టిరెడ్డిపై గ‌రం గ‌రం…
బీసీ సంఘాల రౌండు టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఖమ్మం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించలేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా ఇటు ఎమ్మెల్యే, అటు ముఖ్యమంత్రిలో ఎటువంటి చ‌ల‌నం లేక‌పోవ‌డం కాంగ్రెస్ పార్టీ అస‌మ‌ర్ధ‌పాల‌న‌కు నిద‌ర్శ‌మ‌న్నారు.. ఇచ్చిన మాటకు కట్టుబడి రీజనల్ రింగ్ రోడ్ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *