విలీనం చేయకుంటే సమ్మె చేస్తాం..

విలీనం చేయకుంటే సమ్మె చేస్తాం..

నర్సంపేట, ఆంధ్రప్రభ : ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కొలిశెట్టి రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు, కన్వీనర్ లడె శ్రీకాంత్ లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఏర్పడినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులకు టైముకు వేతన సవరణ చేయలేదని, సమస్యలను సత్వరంగా పరిష్కరించ లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నించారు. 90 శాతం పూర్తయిన ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని ఒకే ఒక్క కలం సంతకంతో అపాయింటెడ్డేట్ ను ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 38 వేల ఆర్టీసీ కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకుని అపాయింట్ మెంట్ డేటును వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేయవలసి వస్తుందని వారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా, పెండింగ్ లో ఉన్న 2021, 2025 పీఆర్సీలను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటించాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, యూనియన్లను అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, యూనియన్ల అనుమతి రెండు ప్రధాన అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అంటున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 25న హైదరాబాద్ లో జరిగే జేఏసీతో జరిగే చర్చలలో మిగిలిన అంశాలు రెండు పీఆర్సీలను, సంపూర్ణ ఉద్యోగ భద్రత పై కీలక ప్రకటన చేయాలని రంగయ్య, వేణు, శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply