నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా..

నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా..

గంపలగూడెం, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆయన తన సతీమణి జానకితో కలిసి పాల్గొన్నారు. కళ్యాణోత్సవానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ అధికారులు,స్థానిక ఎన్డీయే కూట‌మి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భక్తుల మధ్యనే కూర్చొని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు వేద మంత్రోచ్ఛార‌ణ‌లు, మంగ‌ళ‌వాయిద్యాల మ‌ధ్య వైభ‌వంగా జ‌రిగిన స్వామి వారి క‌ళ్యాణాన్ని క‌నులారా వీక్షించారు.


మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని, స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. వేణుగోపాలస్వామి కొలువైన నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ వేణుగోపాలస్వామిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మహోత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు కన్నుల పండుగలా నిర్వహించారని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పునీతులయ్యారని చెప్పారు. ఉత్సవాలను పురస్కరించుకుని సమగ్ర ఏర్పాట్లు చేసిన ఆలయ పాలకమండలి ధర్మకర్తలు, అర్చకులు,అధికారులకు ఎంపి శివనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply