HYD | చెరువుల్లో మట్టి నింపుతున్నవారిపై హైడ్రా నిఘా..

  • ఐదు టిప్పర్లు, జేసీబీ సీజ్‌…
  • రెండుచోట్ల కేసు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భూకబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నా కబ్జాదారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కబ్జాలను నియంత్రణకు హైడ్రా కమిషనర్ ఎవి.రంగనాథ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అక్రమార్కులు నిర్భయంగా తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతిరోజూ ఏదో ఒక చోట అక్రమార్కులు భూ దందాలు కొనసాగిస్తూ హైడ్రాకు దొరికిపోతున్నారు

ప్రతి సోమవారం జరిగే హైడ్రా ప్రజావాణిలో కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జాలను చేస్తున్న బడా బాబుల భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా సోమవారం రాత్రి ఉందానగర్‌, బషీరాబాద్‌ ప్రాంతాల్లోని చెరువుల్లో రాత్రి వేళల్లో మట్టిపోసి చదును చేస్తున్నట్లు రెండు చోట్ల ఫిర్యాదులు అందడంతో హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ క్ర‌మంలో బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉందానగర్‌ చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తున్న నాలుగు టిప్పర్లు, జేసీబీ యంత్రాన్ని హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందాలు సీజ్ చేయ‌గా.. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవులపల్లి (సమర్‌ కుంట) చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తున్న టిప్పర్‌ ను సీజ్‌ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు.

చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి, గృహ సంబంధ వ్యర్థ పదార్థాలు అక్రమంగా తరలించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *